సంక్షేమ పథకాలే అజెండా..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత మొదటి సారి జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఈ సమావేశం జరగనుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధికారులు పాల్గొంటున్నారు. చర్చించాల్సిన అంశాలతో కూడిన ఎజెండాను చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి కార్యాలయం ఇప్పటికే రూపొందించింది


 ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించనున్నారు.  ప్రత్యేక సమస్యలపై చర్చ జరగనుంది.
♦ జగన్‌ అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన నవరత్నాలను అమలులోకి తీసుకువచ్చారు. రానున్న ఉగాది పండుగ నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది అర్హులైన నిరుపేదలకు ఇండ్లస్థలాలు మంజూరుకు ప్ర«థమ ప్రాధాన్యత ఇస్తున్నారు.  రెవెన్యూ అధికారులు ఇప్పటికే అర్హుల జాబితా రూపొందించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, సేకరించాల్సిన భూమి, చదును చేసేందుకు ఎంత నిధులు అవసరమో గుర్తించారు.  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇటీవల జిల్లాకు వచ్చిన రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఈ అంశంపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా అ««ధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.


♦ రైతులకు కాసింత చేయూత నివ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ పథకాన్ని ఈనెల 15వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.9500లు చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి.  ఈ పథకంలో పలు సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతోరైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బ్యాంకు అకౌంట్‌లో ఆధార్‌లింకు చేసినప్పటికి కంప్యూటర్‌లో నో డేటా ఫౌండ్‌ అని చూపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాసాధికారి సర్వే చేయించుకున్నప్పటికి తమ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని రైతులు అంటున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఇప్పటి వరకు ఇలాంటి పిర్యాదులు బుధవారం నాటికి 416 వచ్చాయి. యాప్‌లో ఏదైనా సమస్యలున్నాయోమో కనుగొనాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.