కడప జిల్లాలో టీడీపీ ఖాళీ

కడప జిల్లాలో టీడీపీ ఖాళీ



సాక్షి, కడప : జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వారంతా నేడు బీజేపీలోకి ఫిరాయించారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 24,25, 26 తేదీల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నట్లు చెబుతున్నారని, ఆయన పర్యటన ఖరారై రెండు సార్లు రద్దయిందన్నారు. ఎంపీ సీఎం రమేష్‌ బీజేపీలోకి వెళ్లడంతో మొదటిసారి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీ మారడంతో మరోసారి రద్దయిందని చెప్పారు. కడప పర్యటన చంద్రబాబుకు అచ్చి రావడం లేదని ఎద్దేవా చేశారు. జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా, అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మూడు రోజులు పర్యటించని ఆయన ఇప్పుడు మూడు రోజులు పర్యటించడానికి గల కారణాలేమిటో చెప్పాలన్నారు.