పోలీసు కుట్రతో చంద్రబాబుపై దాడి: అచ్చెన్న

పోలీసు కుట్రతో చంద్రబాబుపై దాడి: అచ్చెన్న


విజయవాడ: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పర్యటన సమయంలో బస్సుపై దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆనాటి సంఘటనను వివరించారు. అనంతరం ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాజధానిపై సీఎం, మంత్రులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అవాస్తవాలు బెబుతోందని చెప్పేందుకే అమరావతిలో చంద్రబాబు పర్యటించారని అన్నారు. గవర్నర్‌ వాస్తవాలు గ్రహించి మా ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
పోలీసుల కుట్రతోనే చంద్రబాబుపై దాడి జరిగిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. జనాల్ని బయటి నుంచి తీసుకొచ్చి వైకాపా దాడి చేయించిందని మండిపడ్డారు. ' మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళను అరెస్టు చేశారు. బాధ చెప్పుకున్న మహిళను అరెస్టు చేయడం దారుణం. అసభ్య పదజాలం వాడిన కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదు.చంద్రబాబు పర్యటనలో వాడిన బస్సులను సీజ్‌ చేశారు. బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ను అదుపులోకి తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. గవర్నర్‌ వాస్తవాలు గ్రహించి మా ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.